పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టిన మరో రైలు.. ఎనిమిది మంది ప్రయాణికులు దుర్మరణం
మహారాష్ట్రలోని జల్గావ్‌లో బుధవారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 22 Jan 2025 7:12 PM ISTమహారాష్ట్రలోని జల్గావ్‌లో బుధవారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురై కదులుతున్న రైలు నుంచి దూకారు. ఆ సమయంలోనే పక్కన ఉన్న ట్రాక్‌పై కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వస్తోంది. రైలు నుంచి దూకిన ప్రయాణికులను కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢి కొట్టింది. పుకార్లు విని దాదాపు 30 నుంచి 40 మంది రైలు నుంచి కిందకు దూకినట్లు చెబుతున్నారు. కాసేపట్లో మంత్రి గిరీష్ మహాజన్ సంఘటనా స్థలానికి చేరుకుంటారు.
జల్గావ్‌లోని పచోరా తహసీల్‌లోని పర్ధాడే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 7 నుంచి 8 మంది మృతి చెందినట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేశారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ముంబై సిఎస్‌టి వైపు వెళ్తుంది. రైలు పచోరా రైల్వే స్టేషన్‌లో పార్క్ చేసి వుంది.. ఆ సమయంలో రైలులోని బి4 బోగీలో మంటలు చెలరేగాయని.. ఆ తర్వాత రైలులో మంటలు వ్యాపించాయని చెబుతున్నారు.
ఒక సీనియర్ రైల్వే అధికారి పిటిఐతో మాట్లాడుతూ.. 'హాట్ యాక్సిల్' లేదా 'బ్రేక్-బైండింగ్' (జామింగ్) పుష్పక్ ఎక్స్‌ప్రెస్ కోచ్ లోపల స్పార్క్‌కు కారణమైంది.. ఇది కొంతమంది ప్రయాణికులను భయానికి గురిచేసింది. చైన్ లాగి కొందరు పట్టాలపై నుంచి కిందకు దూకారు. అదే సమయంలో పక్కనే ఉన్న ట్రాక్‌పై నుంచి మరో రైలు వెళ్తోందని పేర్కొన్నారు. .
ఘటనాస్థలికి సీనియర్ అధికారులు చేరుకుంటున్నారని.. ఆ తర్వాత మరింత సమాచారం అందుబాటులోకి వస్తుందని మహారాష్ట్ర మంత్రి గులాబ్ రావ్ పాటిల్ తెలిపారు.