గుడ్లలో క్యాన్సర్ కారకాలున్నాయనే ఆందోళనల నేపథ్యంలో భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) శనివారం స్పష్టంగా దేశంలో లభించే గుడ్లు మానవ వినియోగానికి సురక్షితమైనవని స్పష్టం చేసింది. గుడ్ల నాణ్యతపై వస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించేవని, వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కొట్టిపారేసింది. ఇటీవల కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులలో కోడిగుడ్లలో నైట్రోఫ్యూరాన్ జీవక్రియా ఉత్పన్నాలు (AOZ) అనే క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీనిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పందిస్తూ, 2011 ఆహార భద్రతా నిబంధనల ప్రకారం కోళ్ల పరిశ్రమలో, గుడ్ల ఉత్పత్తిలో ఏ దశలోనూ నైట్రోఫ్యూరాన్‌ల వాడకాన్ని కఠినంగా నిషేధించినట్లు గుర్తుచేసింది. నిబంధనల అమలు, పర్యవేక్షణ కోసం మాత్రమే నైట్రోఫ్యూరాన్‌కు కిలోకు 1.0 మైక్రోగ్రామ్ పరిమితి ఉందని, ఇది ప్రయోగశాలల్లో గుర్తించగల అతి తక్కువ స్థాయి అని అధికారులు వివరించారు. ఈ పరిమితి కంటే తక్కువగా అవశేషాలు కనుగొనడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని, అది నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేశారు.
ఈ విషయంలో భారత్ నిబంధనలు అమెరికా, యూరోపియన్ యూనియన్‌లతో సమానంగా ఉన్నాయని పేర్కొన్నారు. సాధారణంగా కోడిగుడ్లు తినడం వల్ల మనుషుల్లో క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ పునరుద్ఘాటించింది. ఏదైనా ఒక బ్రాండ్‌కు చెందిన గుడ్లలో ఇలాంటి ఆనవాళ్లు కనపడితే, అది కేవలం ఆ బ్యాచ్‌కు మాత్రమే పరిమితమని, దాని ఆధారంగా దేశంలోని మొత్తం కోడిగుడ్లు ప్రమాదకరమని ముద్ర వేయడం సరికాదని హితవు పలికింది. వినియోగదారులు అనవసరంగా ఆందోళన చెందకుండా, అధికారిక సమాచారాన్ని నమ్మాలని కోరింది.