టొరంటోలో జరిగిన రథయాత్ర ఊరేగింపుపై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లు విసిరిన తర్వాత ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. జాత్యహంకారం, విదేశీయులపై విద్వేషం దీని వెనుక కారణమని అనుమానిస్తున్నారు. టొరంటో వీధుల్లో భక్తులు భక్తి గీతాలు పాడుతూ వెళుతుండగా సమీపంలోని భవనం నుండి గుడ్లు విసిరారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలను X లో పంచుకున్నారు. ఈ ఘటన పై తీవ్ర నిరసన తెలియజేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు. "కెనడాలోని టొరంటోలో జరిగిన రథయాత్ర వేడుకల సందర్భంగా భక్తులపై గుడ్లు విసిరినట్లు వచ్చిన వార్తల గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఇటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథుడి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమే కాకుండా, ఈ పండుగ ఒడిశా ప్రజలకు తీవ్ర వేదనను కలిగిస్తున్నాయి," అని ఆయన X లో రాసుకొచ్చారాయన. ఈ సంఘటన ఇస్కాన్ 53వ వార్షిక రథయాత్ర సందర్భంగా జరిగింది.