కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం నాడు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు పంపింది. రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ ప్రతిసారీ నేషనల్ హెరాల్డ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ.. బీజేపీ స్వాతంత్య్ర సమరయోధులను అవమానించిందని, అగౌరవపరిచిందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను 1942లో ప్రారంభించారని, అప్పట్లో బ్రిటిష్ వారు దాన్ని అణవిచివేసేందుకు ప్రయత్నించారని, నేడు మోదీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.
సోనియా జూన్ 8న ఈడీ కార్యాలయానికి వెళ్తారని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆ లోపు తిరిగి వస్తే ఈడీ ఎదుట హాజరవుతారని, రాలేకపోతే కొంత సమయం కోరే అవకాశం ఉంటుందని తెలిపారు. ''రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి బీజేపీ తన చేతిలో కీలుబొమ్మలైన ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తోంది. ఈ కేసుపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతాం. 2015లోనే ఈడీ ఈ కేసును మూసివేసింది. రాజకీయ కక్ష సాధింపు, ప్రత్యర్థులను బెదిరించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారు.'' అని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి విమర్శించారు. 2105లో మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటిసులివ్వడం ద్వారా దేశంలో నెలకొన్న తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.