మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఒక క్రిమినల్ కేసులో వాద్రాపై దర్యాప్తు సంస్థ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఈ వ్యవహారంలో వాద్రాను మూడురోజుల పాటు ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. ఆయనతో పాటు మరికొందరిపై స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాబర్ట్ వాద్రా, అతనికి చెందిన అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.37.64 కోట్లకు పైగా విలువైన 43 స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసినట్టు అధికారులు తెలిపారు.
అధికారిక వివరాల ప్రకారం, గురుగ్రామ్‌లోని హర్యానాలోని మనేసర్-షికోహ్‌పూర్ లో జరిగిన భూ ఒప్పందం జరిగింది. 2008, ఫిబ్రవరి నాటి ఈ ఒప్పందంలో భాగంగా షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి వాద్రా గతంలో డైరెక్టర్‌గా ఉన్న స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ భూములను వాద్రా రూ.58 కోట్లకు విక్రయించారు. దీంతో రాబర్ట్ వాద్రాతో పాటు మరో 11 మందిపై ఈడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పేరిట ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసి విక్రయించారని ఛార్జిషీట్‌లో ఈడీ అధికారులు పేర్కొన్నారు.