ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇవాళ ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాకు ఢిల్లీ కోర్టు వచ్చే నెల 7 వరకు ఈడీ రిమాండ్ విధించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అధికారులు అరెస్ట్ చేశారు. గురుగాంకు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. వ్యాపారులు అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేలు సిసోడియాకు సన్నిహితులని ఈడీ వెల్లడించింది. వీరు మద్యం లైసెన్సుదారుల నుంచి సేకరించిన డబ్బును ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించడంలో చురుగ్గా వ్యవహరించారని తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా సిసోడియాకు అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఈ కేసులో సీబీఐ తొలి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. సుమారు 10 వేల పేజీల ఛార్జ్షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో A1 గా కుల్దీప్ సింగ్, A2 గా నరేంద్ర సింగ్, A3గా విజయ్ నాయర్, A4 గా అభిషేక్ బోయిన పల్లి ఉన్నారు. విజయ్ నాయర్, అభిషేక్ రావుకు ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.