రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు దేశంలో ఓమిక్రాన్ భయం పట్టుకుంది. ఎన్నికల సంఘం సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని లేఖలో కోరింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో సహా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో ఎన్నికల సంఘం ఈరోజు సమావేశాన్ని నిర్వహించింది. ఐదు రాష్ట్రాలలో మూడు నెలల లోపు ఎన్నికలు జరగనున్నందున దేశంలో కొవిడ్-19 పరిస్థితిని ఈ భేటీలో చర్చించింది.
వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో ఎన్నికల సంఘం, ఆరోగ్యశాఖ అధికారులు దేశంలో పెరుగుతున్న COVID-19 కేసులు, టీకా కవరేజీతో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ముప్పు గురించి చర్చించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనుంది.
ఓమిక్రాన్, కోవిడ్-19 కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ఉత్తరప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను వెంటనే రెండు నెలల పాటు వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఎన్నికల సంఘాన్ని కోరింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీల ర్యాలీలు, బహిరంగ సభలను తక్షణమే నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీని, ఎన్నికల సంఘాన్ని కోర్టు అభ్యర్థించింది. ఇదిలావుంటే.. సోమవారం నాడు అత్యధికంగా 156 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి చేరుకుంది.