ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆరు నుంచి ఎనిమిది దశల్లో, పంజాబ్‌లో రెండు నుంచి మూడు దశల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం నిర్వహించిన చివరి సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. కోవిడ్ ఉప్పెన నేపథ్యంలో ప్రచారాలను నిషేధించాలనే నినాదం పెరిగినప్పటికీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని చెప్పారు.
దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలపై నిపుణుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లోని అధికారులను కోరింది. ఎన్నికల సమయంలో కోవిడ్ భద్రతను నిర్ధారించడానికి అనేక చర్యలను ప్రకటించింది. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మేలో ముగుస్తుండగా, మిగిలిన నాలుగు అసెంబ్లీల గడువు మార్చిలో వేర్వేరు తేదీల్లో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసన సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.