గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు

EC announces Gujarat Assembly election schedule.గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2022 1:37 PM IST
గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు

దేశంలో ఎన్నిక‌ల న‌గారా మోగింది. గురువారం గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది. గుజ‌రాత్ రాష్ట్రంలో రెండు విడుత‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ) ప్ర‌క‌టించింది. తొలి ద‌శ పోలింగ్ డిసెంబ‌ర్ 1న‌, రెండో విడుత పోలింగ్ డిసెంబ‌ర్ 5న జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపింది. డిసెంబ‌ర్ 8న ఫ‌లితాల‌ను ప్ర‌కటించ‌నున్న‌ట్లు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

తొలి విడత పోలింగ్ కోసం ఈ నెల 5న, రెండో విడత కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చెప్పారు. తొలి విడుత‌లో 89 స్థానాల‌కు, రెండ‌వ విడుత‌లో 93 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

గుజ‌రాత్‌లో రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జ‌న‌ర‌ల్ 142, ఎస్టీ 13, ఎస్సీ 27 స్థానాలు ఉన్న‌ట్లు సీఈసీ వెల్ల‌డించారు. 51,782 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. ఇందులో అర్బ‌న్ ప్రాంతాల్లో 17506, రూర‌ల్ ఏరియాలో 34276 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. మొత్తం ఓట‌ర్ల సంఖ్య 4,90,89765. ఇందులో తొలిసారి 4,61,494 మంది ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బీజేపీ ప్ర‌భుత్వం గ‌డువు 2023 ఫిబ్ర‌వ‌రి 18తో ముగియ‌నుంది. ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా వచ్చే నెలలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. డిసెంబర్ 10న‌ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.


Next Story