వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు.. మ‌ణిపూర్‌, మేఘాల‌య‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, త‌జికిస్థాన్‌లో కూడా

వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తున్నాయిఈ ఉద‌యం మణిపూర్, మేఘాలయలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2023 12:18 PM IST
వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు.. మ‌ణిపూర్‌, మేఘాల‌య‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్, త‌జికిస్థాన్‌లో కూడా

వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తున్నాయి. ట‌ర్కీ, సిరియాలో భూకంపాలు సంభ‌వించిన త‌రువాత మ‌న దేశంలోనూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. వాటిని నిజం చేస్తూ ఉత్త‌ర‌, ఈశాన్య భార‌త దేశంలో అక్క‌డ‌క్క‌డ భూమి కంపిస్తోంది. ఈ ఉద‌యం మణిపూర్, మేఘాలయలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. మణిపూర్‌లోని నోనీ జిల్లాలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2.46 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 3.2 గా న‌మోదైంది. 25 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభ‌వించింది.

మేఘాలయలోని తురా జిల్లాలో కూడా భూకంపం సంభవించింది. తురాకు ఉత్త‌రాన 59 కిలోమీట‌ర్ల దూరంలో 29 కిలోమీట‌ర్ల లోతులో భూమి కంపించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 3.7గా న‌మోదైంది.

ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్‌లో భూకంపాలు

ఆఫ్ఘనిస్తాన్‌, త‌జికిస్తాన్‌లో కూడా భూమి కంపించింది.

మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటల సమయంలో అప్ఘనిస్తాన్ లో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంనలు చోటు చేసుకున్నాయి.

ఆప్ఘనిస్తాన్ లో భూకంపం సంభ‌వించిన‌ గంటన్నర వ్యవధిలోనే తజకిస్థాన్ లోనూ భూమి కంపించింది. ఉద‌యం 5.31 గంటలకు తజకిస్థాన్ లో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 గా న‌మోదైంది.

కాగా.. ఈ భూకంపాల‌ వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

Next Story