దీపావ‌ళి వేళ వ‌రుస భూకంపాలు.. వణికిన మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అస్సాం

Earthquake of magnitude 3.5 hits Manipur.దీపావళి పండుగ వేళ వ‌రుస భూకంపాలు భార‌తావ‌నిని వ‌ణికించాయి. గురువారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 11:53 AM IST
దీపావ‌ళి వేళ వ‌రుస భూకంపాలు.. వణికిన మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అస్సాం

దీపావళి పండుగ వేళ వ‌రుస భూకంపాలు భార‌తావ‌నిని వ‌ణికించాయి. గురువారం ఉద‌యం హిమాచ‌ల్ ప్ర‌దేశ్, మ‌ణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. మ‌ణిపూర్‌లోని చందేల్‌లో ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై 3.5 గా న‌మోదు అయిన‌ట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. భూమికి 52 కిలోమీట‌ర్ల లోతున మెయిరాగ్‌కు ద‌క్షిణ-ఆగ్నేయంగా 57 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన‌ట్లు వెల్ల‌డించింది.

హిమాచల్‌ప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఉదయం 6.25 గంటలకు 2.5 తీవ్రతతో ఓసారి.. అనంత‌రం ఉద‌యం 7.13గంటలకు 2.4 తీవ్ర‌త‌తో రెండోసారి భూమి కంపించింది. ఇక అస్సాం రాష్ట్రంలో ఉద‌యం 10.19 గంట‌ల‌కు రిక్ట‌ర్ స్కేల్‌పై 3.7 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది.

వ‌రుస భూప్ర‌కంప‌న‌ల‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. మూడు రాష్ట్రాల్లో సంభ‌వించిన భూప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు చెప్పారు.

Next Story