ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. భ‌యాందోళ‌న‌లో మూడు దేశాల ప్ర‌జ‌లు

Earthquake of 6.1 Magnitude Strikes India-Myanmar Border Region.శుక్ర‌వారం తెల్ల‌వారుజామున సంభ‌వించిన వ‌రుస

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Nov 2021 8:10 AM IST
ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. భ‌యాందోళ‌న‌లో మూడు దేశాల ప్ర‌జ‌లు

శుక్ర‌వారం తెల్ల‌వారుజామున సంభ‌వించిన వ‌రుస భూకంపాలు మూడు దేశాల‌ను వ‌ణికించాయి. వాటి తీవ్ర‌త అధికంగా ఉండ‌డంతో భార‌త్ స‌హా బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ దేశాల ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. తొలుత భార‌త్‌-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దుల్లో భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. శుక్ర‌వారం ఉద‌యం 5.06 గంట‌ల‌కు బంగ్లాదేశ్‌లోని చిట్ట‌గాంగ్ స‌మీపంలో భూకంపం సంభ‌వించిన‌ట్లు యూరోపియన్‌-మెడిటేరియన్‌ సీస్మోలాజికల్‌ సెంటర్ వెల్ల‌డించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ 6.3గా న‌మోదు అయిన‌ట్లు తెలిపింది.

చిట్ట‌గాంగ్‌ నగరానికి తూర్పున 174 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. చిట్టాగాంగ్ సిటీ.. భారత్-మయన్మార్ సరిహద్దు రీజియన్ పరిధిలోకి వస్తుంది. బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉండ‌డంతో.. సునామీ ఆందోళనలు వెలువ‌డ్డాయి. అయితే.. సునామీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని యూరోపియన్‌-మెడిటేరియన్‌ సీస్మోలాజికల్ తెలిపింది. దీని ప్ర‌భావం భారత్-మయన్మార్ సరిహద్దులోని పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాంలలో చూపింది. తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాంలలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.కోల్‌కతా, గౌహతిలోని చాలా ప్రాంతాల్లో భూమి 30 సెక‌న్ల పాటు కంపించిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. ప్ర‌ధాన భూకంపం అనంత‌రం ప‌లు స్వ‌ల్ప స్థాయిలో భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించినట్లు యూరోపియన్‌-మెడిటేరియన్‌ సీస్మోలాజికల్ తెలిపింది.

ఆ త‌రువాత మ‌రో 10నిమిషాల‌కు మ‌రో భారీ భూకంపం భార‌త్‌లోని ఈ శాన్య రాష్ట్రం మిజోరాంలో సంభ‌వించింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 5.15 గంట‌ల‌కు భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 6.1గా న‌మోదు అయిన‌ట్లు నేషనల్‌ సెంటర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం మిజోరంలోని థెన్‌జాల్‌కు ఆగ్నేయంగా 12కిలోమీటర్ల దూరంలో 73కిలోమీటర్ల లోతులో ఉన్న‌ట్లు గుర్తించారు.

భూకంపం సంభ‌వించిన ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈ భూకంపాల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌న‌ష్టం వాటిన‌ట్లు స‌మాచారం అంద‌లేదు. అయితే.. భారీగా ఆస్తిన‌ష్టం వాటిన‌ట్లు తెలుస్తోంది.



Next Story