ఛత్తీస్‌గఢ్‌లో భూప్రకంపనలు.. భ‌యంతో జ‌నం ప‌రుగులు

Earthquake of 4.8 magnitude strikes Chhattisgarh's Ambikapur.ఛ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2022 8:58 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో భూప్రకంపనలు.. భ‌యంతో జ‌నం ప‌రుగులు

ఛ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. శుక్ర‌వారం ఉద‌యం 5.28 గంట‌ల స‌మ‌యంలో సుర్గుజా జిల్లా అంబికాపూర్‌కు స‌మీపంలో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.8గా న‌మోదు అయ్యింద‌ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రాన్ని అంబికాపూర్‌కు 65 కిలోమీట‌ర్ల దూరంలో గుర్తించినట్లు వెల్ల‌డించింది. భూమి అంత‌ర్భ‌గంలో 10 కిలోమీట‌ర్ల లోతులో క‌ద‌లిక‌లు ఏర్ప‌డ్డాయ‌ని చెప్పింది. ఇళ్ల‌లో నిద్రిస్తున్న ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌తో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. కాగా.. ఈ భూకంపం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిలిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. బుధ‌వారం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో భూమి కంపించింది. ఉట్నూరు మండ‌ల కేంద్రంలో స్వ‌ల్పంగా భూమికి కంపించింది. బుధ‌వారం రాత్రి 11.23 గంట‌ల స‌మ‌యంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో.. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచ్చారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. భూకంపం ధాటికి ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయని చెప్పారు. కొన్ని ఇళ్లలో సామాగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడిపోయాయి. భూకంప భయంతో ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. కాగా భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.0గా నమోదైందని అధికారులు తెలిపారు. ఉట్నూరు మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని, భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులు భూకంపం వచ్చినట్లు వెల్లడించారు.
Next Story