ఉత్తరాఖండ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

Earthquake of 4.5 magnitude hits Uttarakhand's Tehri Garhwal.ఉత్త‌రాఖండ్‌లో ఆదివారం భూ కంపం సంభ‌వించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2022 11:10 AM IST
ఉత్తరాఖండ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

ఉత్త‌రాఖండ్‌లో ఆదివారం భూ కంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.5గా న‌మోదు అయ్యింది. ఈ రోజు ఉద‌యం 8.33 గంట‌ల స‌మ‌యంలో తెహ్రీకి స‌మీపంలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ట్లు అధికారులు తెలిపారు. తెహ్రీకి 78 కిలోమీట‌ర్ల దూరంలో, భూ అంత‌ర్భాగంలో 5 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించిన‌ట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది.

కాగా.. ఈ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు చెప్పారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.

ఇదిలాఉంటే.. గ‌త ఆరేళ్ల‌లో ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ, చమోలి, రుద్రప్రయాగ్ మరియు అనేక ఇతర ప్రాంతాల్లో ప‌లు మార్లు భూమి కంపించింది. వీటి తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 4 నుండి 5.1 గా న‌మోదు అవుతున్నాయి. అక్టోబర్‌ 8న 3.9 తీవ్రతతో మున్సియారీలో భూమి కంపించింది. అక్టోబర్‌ 2న 2.5 తీవ్రతతో ఉత్తరకాశీలో ప్రకంపన‌లు చోటుచేసుకున్నాయి.

Next Story