మత్తు అంత పని చేస్తుంది.. పాకిస్థాన్‌లోకి వెళ్ళిపోయాడు..!

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఒక వ్యక్తి మాదకద్రవ్యాలకు బానిసై, భారత్-పాకిస్తాన్ సరిహద్దును దాటి వెళ్ళిపోయాడు.

By -  Medi Samrat
Published on : 25 Dec 2025 7:30 PM IST

మత్తు అంత పని చేస్తుంది.. పాకిస్థాన్‌లోకి వెళ్ళిపోయాడు..!

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఒక వ్యక్తి మాదకద్రవ్యాలకు బానిసై, భారత్-పాకిస్తాన్ సరిహద్దును దాటి వెళ్ళిపోయాడు. దీంతో పాకిస్తాన్ రేంజర్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జలంధర్‌లోని భోయ్‌పూర్ గ్రామానికి చెందిన శరణ్‌జిత్ సింగ్ నవంబర్ 2న సరిహద్దును దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. షాకోట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) సుఖ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ, శరణ్‌జిత్ కుటుంబం నవంబర్ 7న ఫిర్యాదును దాఖలు చేసిందని చెప్పారు. పాకిస్తాన్ రేంజర్లు చేతులకు సంకెళ్లు వేసిన అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శరణ్‌జిత్ ఆచూకీ గురించి కుటుంబానికి తెలిసింది.

శరణ్‌జిత్ తల్లిదండ్రులు నవంబర్ 2 సాయంత్రం అతను ఇంటి నుండి వెళ్లిపోయాడని చెప్పారు. శరణ్‌జిత్ స్నేహితుడు మన్దీప్ అతన్ని పాకిస్తాన్ సరిహద్దు నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేమ్కరన్ వద్ద వదిలి వెళ్ళాడు. అయితే సింగ్ తిరిగి రాకపోవడంతో, అతని తల్లిదండ్రులు మన్దీప్ ఆచూకీ గురించి ఆరా తీశారు. మన్దీప్ చాలా రోజులు కుటుంబానికి అబద్ధం చెప్పాడు. కానీ చివరికి తాను శరణ్‌జిత్‌ను ఖేమ్కరన్‌లో వదిలి వెళ్ళానని ఒప్పుకున్నాడు. నవంబర్ 21న, సింగ్‌ను పాకిస్తాన్‌లో నిర్బంధించారని సోషల్ మీడియా ద్వారా వార్తలు అందడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తమ కుమారుడిని రక్షించి తీసుకుని రావాలని పోలీసులను వేడుకుంటోంది.

శరణ్‌జిత్ గత 10 సంవత్సరాలుగా రెజ్లర్‌గా ఉన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే, అతను 2024 నుండి మాదకద్రవ్యాలను ఉపయోగించడం ప్రారంభించాడు. శరణ్‌జిత్ మత్తుకు బానిస అయ్యాడు. తరచుగా తన కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. అతని అన్నయ్య గత ఎనిమిది సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్నాడు, అతని సోదరి పంజాబ్‌లో విద్యార్థిని. గతంలో, ఒక ఘర్షణకు సంబంధించి శరణ్‌జిత్‌పై మొదటి సమాచార నివేదిక (FIR) నమోదు చేయబడింది. అతను అక్టోబర్ 17న జైలు నుండి విడుదలయ్యాడు.

Next Story