జమ్మూ కశ్మీర్‌లోని త్రాల్‌లో భద్రతా దళాలతో జరిగిన భారీ కాల్పుల్లో ముగ్గురు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోడానికి ముందు డ్రోన్ ఫుటేజ్ లో కీలకమైన క్షణాలు కనిపించాయి. భద్రతా దళాలు చుట్టుముట్టిన తర్వాత ఉగ్రవాదులు, నిర్మాణంలో ఉన్న భవనంలో చేతుల్లో రైఫిల్స్ పట్టుకుని దాక్కున్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని త్రాల్‌లోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం ఉంది. భద్రతా సిబ్బందిని చూడగానే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా, మరికొంతమంది కూడా దాక్కునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. వీరంతా జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా నివాసితులు.