'మద్యం తాగండి.. గుట్కా నమలండి'.. ప్రజలకు బీజేపీ ఎంపీ పిలుపు.. వీడియో

Drink alcohol, smoke weed, but… BJP MP Janardan Mishra at water conservation event. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ జనార్దన్‌ మిశ్రా సంచలన కామెంట్స్‌ చేశారు.

By అంజి  Published on  8 Nov 2022 11:06 AM IST
మద్యం తాగండి.. గుట్కా నమలండి.. ప్రజలకు బీజేపీ ఎంపీ పిలుపు.. వీడియో

మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ జనార్దన్‌ మిశ్రా సంచలన కామెంట్స్‌ చేశారు. మద్యం తాగాలని, గుట్కా నమలాలని, థిన్నర్‌ను పీల్చాలని ప్రజలకు జనార్దన్‌ మిశ్రా పిలుపునిచ్చారు. రేవాలో నీటి పరిరక్షణపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్‌ మిశ్రా చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. నీటి సంరక్షణపై ఎంపీ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని, కాబట్టి వాటిని రక్షించాలని పేర్కొన్నారు.

''గుట్కా నమలండి, మద్యం తాగండి, థిన్నర్‌ను పీల్చండి. ఐయోడెక్స్ తినండి. కానీ నీటి ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకోండి'' అని మిశ్రా వ్యాఖ్యానించారు. చాలా వరకు నీటి వనరులు ఎండిపోతున్నాయని, బోర్‌వెల్‌లు, గొట్టపు బావులు తవ్వి భూగర్భ జలాలను ఖాళీ చేస్తున్నారన్నారు. భూగర్భ జలాలను పెంపొందించడంతోపాటు నీటి సంరక్షణకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. "మీరు ఎక్కువ నీటిని వినియోగిస్తే, భూగర్భ జలాల్లోకి నీరు ఇంకిపోకుండా ఉంటే, భవిష్యత్ తరానికి నీరు లేకుండా పోతుంది." అని అన్నారు. జలసంరక్షణ నేటి ఆవశ్యకమని అన్నారు. "మీకు కావలసిన చోట మీ డబ్బును వృధా చేసుకోండి, అయితే నీటి సంరక్షణలో పెట్టుబడి పెట్టడంలో ప్రాధాన్యతనివ్వాలి" అని ఆయన అన్నారు.

మత్తులో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదనీ, అయితే వద్దని చెప్పినా ప్రజలు వినరని అన్నారు. ప్రజలు మతపరమైన కార్యకలాపాలలో లేదా వ్యక్తిగత విషయాల కోసం పెట్టుబడి పెట్టవచ్చని, అయితే కొంత భాగాన్ని పర్యావరణం కోసం ఖర్చు చేయాలని ఆయన అన్నారు. మిశ్రా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏదైనా ప్రభుత్వం నీటి పన్నులు మాఫీ చేస్తామని చెబితే నీటి పన్నులను తాము చెల్లిస్తామని, కరెంటు బిల్లులు సహా ఇతర పన్నులను మాఫీ చెయ్యాలని కోరాలని జనార్దన్ మిశ్రా ప్రజలను కోరారు. ఇటీవల నెట్టింట షేర్ చేయబడిన వీడియోలో.. 66 ఏళ్ల నాయకుడు మిశ్రా టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ అందరీ దృష్టిని ఆకర్షించాడు.


Next Story