భారత రక్షణ రంగంలో మ‌రో మైలురాయి

భారత రక్షణ రంగంలో మరో అద్భుతం నమోదైంది.

By Knakam Karthik
Published on : 14 April 2025 11:01 AM IST

National News, DRDO, Directed Energy Weapon, Military, Indian Army, Indian Armed Forces, Defence Missile

భారత రక్షణ రంగంలో మ‌రో మైలురాయి

భారత రక్షణ రంగంలో మరో అద్భుతం నమోదైంది. లేజర్ ఆయుధంతో విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లను డీఆర్డీవో చేధించింది. దేశీయ సాంకేతికతతో అభివృద్ది చేసిన 30 కిలో వాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థతో శత్రు విమానాలు, మిస్సైళ్లు, స్వార్మ్ డ్రోన్లను విజయవంతంగా భారత రక్షణ పరిశోధన సంస్థ చేధించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ప్రయోగశాలలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం శత్రువులకు గట్టి హెచ్చరిక లాంటిదని భారత రక్షణ పరిశోధన సంస్థ ప్రకటించింది.

ఈ నూతన లేజర్ ఆయుధ వ్యవస్థ ద్వారా ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లు, స్వార్మ్ డ్రోన్లను టార్గెట్‌గా చేసుకుని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. అత్యంత సుదూరం నుంచి వస్తున్న లక్ష్యాలను కేవలం కొన్ని సెకన్లలోనే ధ్వంసం చేయగలిగింది. ఈ ప్రయోగంతో భారత భద్రతా వ్యవస్థ మరింత శక్తిమంతంగా తయారైంది అని డీఆర్డీఓ పేర్కొంది. విద్యుత్ ఆధారంగా పని చేస్తున్నందున సంప్రదాయ ఆయుధాల కంటే దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువ అని డీఆర్డీఓ తెలిపింది. అత్యంత వేగంగా స్పందించే వ్యవస్థ ఉండటంలో లక్ష్యాన్ని ట్రాక్ చేసి, అతి తక్కువ సమయంలోనే ధ్వంసం చేస్తుంది. భవిష్యత్ యుద్ధాల్లో ఇది కీలకంగా మారే ఆయుధం అని.. డీఆర్‌డీఓ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.

డ్రోన్ దాడులు, చిన్న దిగువ ఎత్తులో వచ్చే మిస్సైళ్లను ఇది సమర్థవంతమైన కవంగా నిలుస్తుంది. ఈ లేజర్ ఆయుధం ప్రయోగం భారత రక్షణ రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్‌లో సరిహద్దుల్లో మాత్రమే కాకుండా, అంతరిక్ష ఆధారిత రక్షణ వ్యవస్థల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులు, ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్, డ్రోన్లను ఈ రకమైన వ్యవస్థను ఉపయోగించి నాశనం చేసింది. లేజర్ ఆధారిత ( Directed Energy Weapons) టెక్నాలజీతో ప్రపంచంలోని కొన్ని దేశాలు ముందున్నాయని డీఆర్‌డీఓ తెలిపింది.

ఈ టెక్నాలజీ అత్యాధునిక రక్షణ వ్యవస్థల్లో భాగంగా అభివృద్ధి చేయబడుతోంది. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న లేదా ఇప్పటికే ప్రయోగాల్లో వినియోగిస్తున్న దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, చైనా, జర్మనీ దేశాలు ఈ టెక్నాలజీ లో ముందున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించి ప్రపంచ లేజర్ ఆయుధ పోటీలో నిలిచింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన ప్రొటోటైప్ కావడం విశేషం..అని డీఆర్‌డీఓ పేర్కొంది.

Next Story