వరవరరావును విడిచిపెట్టొదని అంటున్న ఎన్ఐఏ

Don't release Varavara Rao on bail, consider the seriousness of offense. విరసం నేత వరవరరావు ఆరోగ్యం విషయంలో ఎన్నో అనుమానాలు, విడిచిపెట్టొదని అంటున్న ఎన్ఐఏ.

By Medi Samrat  Published on  29 Jan 2021 3:24 PM IST
Dont release Varavara Rao on bail

విరసం నేత వరవరరావు ఆరోగ్యం విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే..! మెరుగైన వైద్యం అందించాలని.. ఆయన వయసు చూసి బెయిల్ మీద విడిచిపెట్టాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతూ ఉండగా.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకండని కోరుతూ ఉంది. వరవరరావును విడిచిపెట్టొద్దని, కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని బాంబే హైకోర్టును ఎన్ఐఏ విజ్ఞప్తి చేసింది. ఆయన కన్నా ఎక్కువ వయసున్నవారు దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీలుగా ఉన్నారని గుర్తు చేసింది.

శుక్రవారం వరవర రావు బెయిల్ పిటిషన్ ను జస్టిస్ ఎస్ షిండే, జస్టిస్ మనీశ్ పితాలేల ధర్మాసనం విచారించింది. ఎన్ఐఏ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. 2018 ఎల్గార్ పరిషద్ కేసులో పోలీసులు వరవరరావును అరెస్ట్ చేశారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం బాగాలేదని వరవరరావు బెయిల్ పిటిషన్ వేశారు. ఆరోగ్యం బాగాలేదన్న కారణాన్ని చూపి బెయిల్ ఇవ్వొద్దని, ఒక్కసారి ఆయనపై ఉన్న కేసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని అనిల్ సింగ్ వాదించారు. ఎంతో మంది పోలీసులు బలవ్వడానికి వరవరరావు కారణమయ్యారని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య అని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేలా ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పుకొచ్చారు.

వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా నానావతి ఆస్పత్రిని ధర్మాసనం ఆదేశించింది. వరవరరావును మళ్లీ జైలుకు పంపిస్తే ఆరోగ్యం క్షీణిస్తుందన్న ఆయన తరఫు లాయర్ల వాదనను అనిల్ సింగ్ కు ధర్మాసనం గుర్తు చేసింది. దానికి బదులిచ్చిన అనిల్ సింగ్.. వరవరరావుకు 80 ఏళ్లు దాటిన విషయం తనకు తెలుసని, కానీ, దేశమంతటా ఆయన కన్నా పెద్ద వయసు వాళ్లు జైళ్లలో గడుపుతున్నారని చెబుతూ ఆశారాం బాపూజీని ఉదాహరణగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని, కావాలంటే జైలులోనే మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.


Next Story