శరణార్థులకు సహాయం చేయోద్దన్న మణిపూర్ ప్రభుత్వం
Don't give shelter to Myanmar nationals.మయన్మార్ లో సంక్షోభం నేపథ్యంలో అక్కడి నుంచి భారత్ కు వస్తున్న శరణార్థులకు ఆహారం, ఆవాసం సదుపాయాలు కల్పించొద్దని ఆదేశాలు జారీ చేసింది.
By Medi Samrat
మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మయన్మార్ లో సంక్షోభం నేపథ్యంలో అక్కడి నుంచి భారత్ కు వస్తున్న శరణార్థులకు ఆహారం, ఆవాసం సదుపాయాలు కల్పించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే గాయాలపాలై వచ్చిన వారికి మానవతా దృక్పథంతో వైద్యం చేయాలని అధికారులకు సూచించింది. ఈ మేరకు చండేల్, టెంగోన్‌పాల్, కామ్‌జాంగ్, ఉర్కుల్, చూరాచాంద్‌పూర్ జిల్లా డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. అనధికారికంగా చొరబడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితులు బాగోలేనందున అక్కడి నుంచి వచ్చిన శరణార్థులకు మానవతా దృక్పథంతో తాత్కాలిక ఆవాసం కల్పించాలని ఐక్యరాజ్యసమితిలో మయన్మార్ అంబాసిడర్ భారత్‌ను అభ్యర్థించారు. ఇరుదేశాల మధ్య సుదీర్ఘ చరిత్ర ఉందని, వాటిని మర్చిపోకూడదని ఆయన గుర్తుచేశారు.
మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సైన్యం ప్రజలపై కాల్పులు జరపడం అక్కడ సర్వసాధారణమైపోయింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వేలాది మంది మయన్మార్ ప్రజలు భారత్‌కు వలస వచ్చే అవకాశమున్న నేపథ్యంలో వలసదారులను కట్టడి చేసేందుకు సరిహద్దు రాష్ట్రమైన మణిపూర్ చర్యలకు ఉపక్రమించింది. వలసదారులకు భోజన సదుపాయం కల్పించేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయవద్దని ఆదేశించింది. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిని సున్నితంగా వెనక్కి తిప్పిపంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తక్షణమే ఆధార్ నమోదు ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరింది. ఆధార్ యంత్రాలను ప్రత్యేకగదుల్లో భద్రపరచాలని పేర్కొంది.
మరోవైపు మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల పట్ల సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. కారణం ఏది అయినప్పటికీ ముఖ్యమంత్రి నిర్ణయం అతిధి దేవోభవ అనే భారత సంప్రదాయానికి విరుద్ధంగా ఉందంటున్నారు.