కడుపులో టవల్ మరచిపోయారు
అలీఘర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ ప్రసవ సమయంలో ఆమె పొత్తికడుపులో టవల్‌ను వదిలివేశారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2024 6:15 PM ISTకడుపులో టవల్ మరచిపోయారు
అలీఘర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ ప్రసవ సమయంలో ఆమె పొత్తికడుపులో టవల్‌ను వదిలివేశారు. అయితే రాను రాను ఆమె ఆరోగ్యం క్షీణించిన తర్వాత వైద్య పరీక్షలు చేసి టవల్ ను బయటకు తీశారు. ఆమెకు రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. గత వారం మహిళను మళ్లీ మరో ఆసుపత్రిలో చేర్చగా అప్పుడు టవల్‌ను తొలగించారు వైద్యులు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి.. మీడియాకు సమాచారం అందించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు.
వికాస్ కుమార్ భార్య ను ప్రసవం కోసం అలీఘర్‌లోని జిటి రోడ్‌లోని శివ మహిమ ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో వైద్యులు అనుకోకుండా ఆమె పొత్తికడుపులో టవల్‌ను వదిలేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళ తీవ్రమైన కడుపునొప్పి వస్తోందంటూ ఫిర్యాదు చేసింది. అయితే ఆసుపత్రి వైద్యులు మందులను సూచించి భయపడకండని చెప్పారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి మరింత దిగజారింది.. ఆమె కుటుంబం మరొక ఆసుపత్రికి వెళ్లగా.. ఆమె కడుపులో టవల్ ఉందని కనుగొన్నారు. టవల్ తొలగించడానికి మరో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ ఘటన పట్ల మహిళ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యులు తమ ఆందోళనలను పట్టించుకోకుండా కేవలం మందులతో ఇంటికి పంపించి తన భార్య ప్రాణాలకు ముప్పు తెచ్చారని, ఆసుపత్రి సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వికాస్ కుమార్ ఆరోపించారు.