'భారత్‌ను పొగాకు రహిత దేశంగా మార్చండి'.. ప్రధానికి వైద్యుల సంఘం లేఖ

Doctors’ body seeks PM’s intervention to make India tobacco-free. న్యూఢిల్లీ : దేశాన్ని పొగాకు రహితంగా మార్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ

By అంజి  Published on  13 Jan 2023 4:29 AM GMT
భారత్‌ను పొగాకు రహిత దేశంగా మార్చండి.. ప్రధానికి వైద్యుల సంఘం లేఖ

న్యూఢిల్లీ : దేశాన్ని పొగాకు రహితంగా మార్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ''పొగాకు వినియోగాన్ని నియంత్రించడం అనేది ఒక ప్రాథమిక నివారణ చర్య. ముఖ్యంగా యువ జనాభా విషయానికి వస్తే, ఇది అనేక మిలియన్ల మంది ప్రాణాలను కాపాడుతుంది. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని పరిశీలించి, దేశం పొగాకు రహితంగా మారడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము'' అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఫైమా పేర్కొంది.

పొగాకు వినియోగం దేశంలోనే అతిపెద్ద ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిందని, ఇది ప్రాణనష్టానికి దారితీయడమే కాకుండా ప్రజలపై భారీ సామాజిక, ఆర్థిక వ్యయాలను కూడా కలిగిస్తుందని వైద్యుల సంఘం లేఖలో పేర్కొంది. పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫైమా ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.

"భారతదేశంలో పొగాకు వాడకం అత్యంత ప్రబలంగా ఉంది. 'ఖైనీ', 'గుట్కా', 'పాన్'తో కూడిన 'జర్దా' వంటి పొగలేని పొగాకుతో పాటు ఇతర ధూమపాన రూపాలు 'బీడీ', సిగరెట్, 'హుక్కా' ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. జనాభాను రక్షించడానికి, ప్రజారోగ్య ముప్పులను తొలగించడానికి ప్రతి రూపంలో ఉన్న పొగాకు వాడకాన్ని నియంత్రించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము'' అని లేఖలో కోరింది.

'' 'పొగాకు రహిత భారతదేశం' ప్రచారం ద్వారా.. మేము పొగాకు దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము. మేము మొదట దేశంలోని ప్రతి వైద్య కళాశాలలో ప్రచారాన్ని ప్రారంభించాము. తరువాత, మేము దానిని పబ్లిక్ డొమైన్‌లో విస్తరిస్తాము'' అని FAIMA జాతీయ అధ్యక్షుడు అజయ్ కుమార్ సింగ్ అన్నారు.

Next Story