యూపీలోని అమ్రోహా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులో టవల్ పెట్టి మరిచిపోయి కుట్లు వేశారు. ఈ కేసుపై సమగ్ర విచారణకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని బాన్స్‌ఖేరీకి చెందిన గర్భిణీ నజరానా పురిటి నొప్పులతో నౌగావానా సాదత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సైఫీ నర్సింగ్ హోమ్‌లో చేరింది.
అక్కడ ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో టవల్ పెట్టి మర్చిపోయి కుట్లు వేశారు. ఆపరేషన్ తర్వాత మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. కడుపులో నోస్తోందని చెప్పగా.. బాధితురాలిని మరో ఐదు రోజులు ఆస్పత్రిలో ఉంచారు. అయితే బయట చలి కారణంగా కడుపునొప్పి వస్తోందని డాక్టర్ చెప్పాడు. ఇంటికి వచ్చినా ఆరోగ్యం బాగోకపోవడంతో భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రోహాలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా నజరానా కడుపునొప్పి వెనుక అసలు నిజం తెలిసింది. దీంతో మరో ఆపరేషన్ చేసి టవల్ తీసేశారు.
ప్రైవేట్ డాక్టర్ మత్లూబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అలీ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. సైఫీ నర్సింగ్ హోమ్ అనుమతి లేకుండా నడుపుతున్నట్లు విచారణలో తేలింది. "ఈ సంఘటన గురించి నాకు మీడియా నివేదికల ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని పరిశీలించమని నోడల్ అధికారి డాక్టర్ శరద్‌ని కోరాను. దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే మేము మరిన్ని వివరాలను చెప్పగలము" అని సిఎంఓ సింఘాల్ మంగళవారం తెలిపారు. అయితే, షంషేర్ అలీ ఈ వ్యవహారంపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని, విచారణ జరుగుతుందని సీఎంవో హామీ ఇచ్చారు.