ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివినంత మాత్రాన వైద్య విద్యార్థి ఒక సంవత్సరం ప్రభుత్వ గ్రామీణ సేవ చేయాలనే నిబంధన నుంచి మినహాయింపు కోరవచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కర్ణాటకలోని డీమ్డ్ యూనివర్శిటీలో ప్రైవేట్ సీట్ల ద్వారా గ్రాడ్యుయేట్ అయిన ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, సంజయ్ కరోల్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ ప్రశ్న వేసింది.
పిటిషనర్లు తమకు నిర్బంధ గ్రామీణ సేవ అఫిడవిట్ ఇవ్వకుండా.. అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల కమిషనరేట్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై స్పందించాలని కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం మంచి విషయమని పేర్కొంది. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు దేశ నిర్మాణానికి సహకరించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించింది.
కర్ణాటక ప్రభుత్వ చట్టాల ప్రకారం.. ప్రభుత్వ కోటా విశ్వవిద్యాలయం లేదా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (డిప్లొమా లేదా డిగ్రీ), సూపర్ స్పెషాలిటీని అభ్యసిస్తున్న ప్రతి వైద్య విద్యార్థి కర్ణాటకలో మెడికల్ కౌన్సిల్ శాశ్వత రిజిస్ట్రేషన్ పొందే ముందు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా ఒక సంవత్సరం సర్వీస్ చేయాలి.
కమిషనరేట్ జారీ చేసిన జూలై 28, 2023 నాటి నోటిఫికేషన్‌ను ఉటంకిస్తూ.. ప్రైవేట్/డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో ప్రైవేట్ సీట్ల ద్వారా వైద్యవిద్యను అభ్యసించిన విద్యార్థులు గ్రామాల్లో కూడా సేవ చేయవలసి ఉంటుందని పిటిషన్‌లో పేర్కొంది.
ప్రైవేట్/డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రైవేట్ సీట్లలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు భారీ మొత్తం చెల్లించి చదువుకుంటున్నామని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిర్బంధ సర్వీసు నిబంధన ఈ విద్యార్థులకు వర్తించకూడదని వారు పిటీషన్‌లో తమ వాదనను వినిపించారు.