బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి హాని కలుగుదుంతని ప్రజారవాణా విషయంలో ఇది సరైన పరిష్కారం కాదని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డీకేను కలిశారు.
ప్రజలు కార్లు కొనుగోలు చేయడం వెనుక ఉన్న సామాజిక పరిస్థితి సూర్యకు అర్థం కావడం లేదని, మీరు సొంత వాహనంలో రాకుండా నేను ఆపగలనా? అని శివకుమార్ ప్రశ్నించారు. ప్రజలు తమ కుటుంబాలతో కలిసి సొంత వాహనాల్లో వెళ్లడానికి ఇష్టపడుతున్నారని, వారిని కార్లు వాడొద్దని చెప్పగలమా? అని ప్రశ్నించారు. కారులేని అబ్బాయిలకు పిల్లను కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అన్నారు.