రైలు ప్రయాణంలో తన పర్సును దొంగిలించినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కోపంతో ఒక మహిళ తన ఏసీ కోచ్ కిటికీని పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తోటి ప్రయాణీకులు ఆపమని అడిగినా కూడా పట్టించుకోకుండా, ఆ మహిళ పదే పదే తన కంపార్ట్‌మెంట్ కిటికీ అద్దాన్ని పగలగొట్టడం చూడొచ్చు. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యంగా చూస్తుండగా కోచ్ అంతటా గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె పక్కనే ఒక పసిబిడ్డ కూర్చుని ఉంది.
ప్రయాణిస్తున్నప్పుడు ఆ మహిళ పర్సు దొంగిలించబడిందని నివేదికలు సూచిస్తున్నాయి. రైల్వే సిబ్బంది, అధికారుల సహాయం లేకపోవడంతో ఆమె రైలు కిటికీపై తన కోపాన్ని వెళ్లగక్కింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది.