సర్పంచ్ హత్య కేసులో మంత్రి రాజీనామా, చాలా బాధపడ్డానని ట్వీట్

. ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు

By Knakam Karthik
Published on : 4 March 2025 12:09 PM IST

National News, Maharashtra, CM Devendra Fadnavis, Minister Dhananjay Munde Resigns, Sarpanch Murder Case

సర్పంచ్ హత్య కేసులో మంత్రి రాజీనామా, చాలా బాధపడ్డానని ట్వీట్

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య వ్యవహారం పొలిటికల్‌గా ప్రకంపనలు రేపుతోంది. సర్పంచ్ సంతోష్ దేశముఖ్ హత్య కేసులో ధనంజయ్‌పై ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ముండే రాజీనామాను తాను ఆమోదించి.. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపానని మీడియాకు తెలిపారు.

ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలకనేత అయిన ధనంజయ్ ముండే సొంత జిల్లా బీడ్లో మసాజోగ్ గ్రామ సర్పంచి సంతోష్ దేశముఖ్‌ను కిడ్నాప్ చేసి ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యోదంతానికి సంబంధించిన కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ముండే రాజీనామా చేసిన కొన్ని క్షణాల తర్వాత, తన మౌనాన్ని వీడి, మసాజోగ్ గ్రామపెద్ద దారుణ హత్యను ఖండిస్తూనే, ఆరోగ్య కారణాల వల్ల తాను రాజీనామా చేశానని పేర్కొన్నాడు. బీడ్ జిల్లాలోని మస్సాజోగ్‌కు చెందిన దివంగత సంతోష్ దేశ్‌ముఖ్ దారుణ హత్య కేసులో నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలనేది మొదటి రోజు నుండి నా దృఢమైన డిమాండ్. నిన్న వెలుగులోకి వచ్చిన ఫోటోలను చూసి, నేను చాలా బాధపడ్డాను," అని ముండే అన్నారు, "ఈ కేసు దర్యాప్తు పూర్తయింది, కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయబడింది. అలాగే, న్యాయ విచారణకు ప్రతిపాదించబడింది... గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, రాబోయే కొన్ని రోజులు చికిత్స తీసుకోవాలని డాక్టర్ నాకు సలహా ఇచ్చారు. అందువల్ల, వైద్య కారణాల వల్ల కూడా, నేను మంత్రివర్గం నుండి నా రాజీనామాను గౌరవ ముఖ్యమంత్రికి సమర్పించాను." అని ఎక్స్ వేదికగా ధనుంజయ్ ముండే రాసుకొచ్చారు.

Next Story