వీఐపీల విమాన ప్రయాణాలపై DGCA కీలక నిర్ణయం..అమల్లోకి రానున్న న్యూ రూల్స్ ఇవే!

దేశంలో VIP విమాన ప్రయాణాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ (DGCA) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 28 March 2026 10:00 PM IST

National News, Delhi, DGCA, New Guidelines, VIP Air Travel, AviationRules

వీఐపీల విమాన ప్రయాణాలపై DGCA కీలక నిర్ణయం..అమల్లోకి రానున్న న్యూ రూల్స్ ఇవే!

దేశంలో అతిముఖ్యమైన వ్యక్తుల (VIP) విమాన ప్రయాణాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ (DGCA) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 27న విడుదల చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం, గతంలో ఉన్న పాత సర్క్యులర్లన్నింటినీ రద్దు చేస్తూ ఏకీకృత భద్రతా నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో తాత్కాలిక హెలిప్యాడ్లు, చిన్న ఎయిర్‌స్ట్రిప్‌ల వద్ద జరుగుతున్న భద్రతా లోపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు. కొత్తగా వచ్చిన 'భారతీయ వాయుయాన్ అధినియం 2024' చట్టంలోని సెక్షన్ 4 కింద ఈ నియమాలకు న్యాయపరమైన హోదా కల్పించారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్ లేదా పీఎస్‌యూ రంగానికి చెందిన ఏ విమాన ఆపరేటర్ అయినా సరే, వీఐపీల ప్రయాణాల విషయంలో ఒకే రకమైన కఠిన ప్రమాణాలను పాటించడం తప్పనిసరి అవుతుంది.

ఈ నిబంధనల పరిధిలోకి లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు మరియు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులను చేర్చారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణానికి ముందే వాతావరణ పరిస్థితులు, విమాన పనితీరుపై పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తాత్కాలిక హెలిప్యాడ్లను 'హై రిస్క్' ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు, అక్కడ ల్యాండింగ్‌కు ముందస్తు అనుమతులు తప్పనిసరి చేశారు.

పైలట్లు లేదా ఆపరేటర్లు ఏ చిన్న పొరపాటు చేసినా కఠిన చర్యలు ఉంటాయని డీజీసీఏ హెచ్చరించింది. ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో ఎన్నికల ప్రచార షెడ్యూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, ప్రాణహాని నివారించేందుకు భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే పాత పద్ధతికి స్వస్తి పలికి, ముందుగానే ప్రమాదాలను నివారించే అత్యాధునిక అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను భారత్ స్వీకరించినట్లయింది.

Next Story