ఇంకా 5 రోజులే.. కుంభమేళాకు కొనసాగుతున్న రద్దీ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది.

By Knakam Karthik
Published on : 21 Feb 2025 11:30 AM IST

National News, KumbhMela, Uttarpradesh, Prayagraj, Mahasivaratri, TriveniSangamam

ఇంకా 5 రోజులే.. కుంభమేళాకు కొనసాగుతున్న రద్దీ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహా కుంభమేళా తుది దశకు చేరింది. మరో ఐదు రోజుల్లో మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత ఆరు రోజులుగా రోజూ కోటి మందికిపైగా భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 58 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు.

కాగా, పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. మరో ఐదు రోజుల పాటు భక్తుల రద్దీ ఇదేవిధంగా కొనసాగుతే.. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య 65 కోట్లు దాటుతుందని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహా కుంభమేళాలో చివరి రోజైన ఫిబ్రవరి 26న రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మేళా ఈ నెల 26తో ముగియాల్సి ఉండగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. అయితే, ప్రభుత్వం మాత్రం పొడిగింపు ఆలోచన లేదని తేల్చిచెప్పింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Next Story