నిందితుడు కాల్పులు జ‌రుపుతుంటే.. పోలీసులు చప్పట్లు కొడ‌తారా.? : ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన ఫడ్నవీస్

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు

By Medi Samrat  Published on  27 Sept 2024 10:30 AM IST
నిందితుడు కాల్పులు జ‌రుపుతుంటే.. పోలీసులు చప్పట్లు కొడ‌తారా.? : ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన ఫడ్నవీస్

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. నిందితుడు అకస్మాత్తుగా పోలీసులపై కాల్పులు జరిపాడు,. ఆ తర్వాత పోలీసుల‌ ప్రతీకార కాల్పుల్లో అతడు చ‌నిపోయాడు. అయితే ఈ ఘటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నేరస్థుడిని న్యాయపరంగా శిక్షించాలనే వాద‌న విన‌ప‌డుతుంది. దీంతో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసుల ఎన్‌కౌంటర్‌ను సమర్థించారు. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు. ఎవరైనా పోలీసులపై దాడి చేస్తే.. పోలీసులు చప్పట్లు కొట్టరు అని స్ట్రాంగ్‌గా బ‌దులిచ్చారు.

దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. "మేము ఎన్‌కౌంటర్‌లను విశ్వసించము. చట్టాన్ని అనుసరించాలని.. దోషిని తదనుగుణంగా శిక్షించాలని నేను నమ్ముతున్నాను. ఇది వీలైనంత త్వరగా చేయాలి.. కానీ దాడి జరుగుతుంటే మా పోలీసులు చప్పట్లు కొట్టరు క‌దా.. అని బ‌దులిచ్చారు.

నిందితుడు అక్షయ్ షిండేను మరో కేసులో ట్రాన్సిట్ రిమాండ్ కింద తలోజా సెంట్రల్ జైలు నుంచి థానే క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తీసుకువస్తుండగా ముంబ్రా బైపాస్ సమీపంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం కాల్పులు జ‌ర‌ప‌డంతో అతడు మరణించాడు. ఈ ఎన్‌కౌంటర్‌పై సీఐడీ దర్యాప్తు చేస్తుంది.

Next Story