నీరు తగ్గడం చూసి ఒడ్డున ఇల్లు కట్టుకోవద్దు.. నేను మహాసముద్రం.. తిరిగి వస్తాను : ఫడ్నవీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి ఘనవిజయం తర్వాత.. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది అతిపెద్ద ప్రశ్నగా ఉంది.

By Medi Samrat  Published on  24 Nov 2024 3:10 PM IST
నీరు తగ్గడం చూసి ఒడ్డున ఇల్లు కట్టుకోవద్దు.. నేను మహాసముద్రం.. తిరిగి వస్తాను : ఫడ్నవీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి ఘనవిజయం తర్వాత.. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది అతిపెద్ద ప్రశ్నగా ఉంది. ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ నేత సీఎం కావాల్సిన అవసరం లేదని ఏక్నాథ్ షిండే అన్నారు. అదే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ మద్దతుదారులు ఆయనను సీఎం చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి పదవిపై తర్జనభర్జనలు జరుగుతున్న తరుణంలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.

శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఫడ్నవీస్ ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో 2019 నాటి స్పీచ్‌తో వీడియో మొదలవుతుంది, అందులో "నా నీరు తగ్గడం చూసి ఒడ్డున ఇల్లు కట్టుకోవద్దు, నేను మహాసముద్రం, నేను తిరిగి వస్తాను" అని ఫడ్నవీస్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ఆయన కుటుంబ సభ్యులు ధీమాగా ఉన్నారు. శనివారం దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి కూడా తన కొడుకు రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి అవుతాడని నమ్మకంగా ఉన్నారు. ఆయన తల్లి సరితా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు.. నా కొడుకు రాష్ట్రంలో పెద్ద నాయకుడిగా ఎదిగినందుకు ఇది చాలామంచి రోజు. 24 గంటలూ కష్టపడుతున్నాడు.. తిండి, నిద్ర లేదు.. ప్రచారం చేస్తూనే ఉన్నాడని పేర్కొంది.

ఫడ్నవీస్ కూతురు దివిజా ఫడ్నవిస్ మాట్లాడుతూ.. "నేను చాలా సంతోషంగా ఉన్నాను, మాకు చాలా మద్దతునిచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, ఇది మాకు చాలా ముఖ్యమైనది." మాకు మద్దతు ఇస్తూ ఉండండి. ప్రజల కోసం పని చేస్తాం. మహారాష్ట్రను గొప్పగా మార్చేందుకు బీజేపీ ఏమైనా చేస్తుందని నేను నమ్ముతున్నాను. తన తండ్రికి సీఎం పదవి దక్కడంపై ప్రశ్నించగా.. కూర్చొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదే అవుతుంది’’ అన్నారు.

ఎన్నికల ఫలితాల గురించి చెప్పాలంటే.. బీజేపీ 132 సీట్లు గెలుచుకోగలిగింది. శివసేన ఏకనాథ్ షిండే వర్గం 57 సీట్లు గెలుచుకుంది. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గానికి) 41 సీట్లు వచ్చాయి. కాగా, మహావికాస్ అఘాడీకి 46 సీట్లు వచ్చాయి.

Next Story