ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు : శివ‌సేన ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇదిలా ఉంటే.. శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  6 Jun 2024 11:37 AM IST
ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు : శివ‌సేన ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇదిలా ఉంటే.. శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఏర్పడదని.. ఆయన ప్రభుత్వం ఏర్పడినా మనుగడ సాగించదని పదే పదే చెబుతున్నానన్నారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. దీంతో బుధ‌వారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. రాష్ట్రంలో బీజేపీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ.. తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ బ‌లోపేతం కోసం ప‌నిచేస్తాన‌నే కోరికను వ్యక్తం చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఫడ్నవీస్.. తనను ప్రభుత్వం నుంచి తప్పించాల్సిందిగా.. పార్టీలోని సీనియర్ నేతలను అభ్యర్థిస్తానని చెప్పారు.

దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటనపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. రాజకీయాల్లో ఇలాంటి జిమ్మిక్కులు సర్వసాధారణం. ఫడ్నవీస్ నాయకత్వాన్ని మహారాష్ట్ర తిరస్కరించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ విలన్ అని, మహారాష్ట్రలో బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురైందన్నారు.

మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి కేవలం 9 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 13 సీట్లు వచ్చాయి. శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గానికి 7 సీట్లు వచ్చాయి. ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గానికి ఒక స్థానం లభించింది. శివసేన (ఉద్ధవ్ వర్గం) 9 సీట్లు గెలుచుకుంది.

Next Story