23 ఏళ్ల నాటి హత్య కేసు.. గుర్మీత్ రామ్ రహీమ్‌కు మళ్లీ పెరుగుతున్న‌ కష్టాలు

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

By Medi Samrat  Published on  3 Jan 2025 2:54 PM IST
23 ఏళ్ల నాటి హత్య కేసు.. గుర్మీత్ రామ్ రహీమ్‌కు మళ్లీ పెరుగుతున్న‌ కష్టాలు

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. 2002లో రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో రామ్‌ రహీమ్‌ బెయిల్‌పై సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అనంతరం కోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ అప్పీల్‌పై శుక్రవారం డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరో నలుగురిని సుప్రీం కోర్టు స్పందన కోరింది.

ఈ కేసులో నిర్దోషులుగా విడుదలైన వారి నుంచి సమాధానం కోరుతూ దేశ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మాజీ సెక్ట్ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్, మరో నలుగురిని నిర్దోషులుగా విడుదల చేస్తూ 2024 మే 28న పంజాబ్, హర్యానా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును CBI సవాలు చేసింది.

గుర్మీత్ రామ్ రహీమ్‌తో సహా ఐదుగురు వ్యక్తులు జూలై 10, 2002న సాయంత్రం తన గ్రామ సమీపంలోని పొలాల్లో పని చేస్తున్న రంజీత్‌ను హత్య చేశారని ఆరోపణ‌లు ఉన్నాయి. ఈ కేసును విచారించిన పోలీసులు నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. రంజీత్.. డేరా సచ్చా సౌదా మాజీ సభ్యుడు, మేనేజర్. ఈ హత్య కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్, ఇతర నిందితులను పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ హత్య కేసులో పంజాబ్ హర్యానా హైకోర్టు గతేడాది మే 2024లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని రద్దు చేస్తూ రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. అంతకుముందు.. పంచకుల ప్రత్యేక కోర్టు ఈ కేసులో శిక్షను మొదట ప్రకటించింది.. తరువాత దానిని హైకోర్టులో సవాలు చేశారు.

హత్య కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సహా ఐదుగురికి పంచకుల కోర్టు గతంలో శిక్ష విధించింది. రామ్ రహీమ్ సహా నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు రూ.31 లక్షల జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం గుర్మీత్ రామ్ రహీమ్ సాధ్వి సెక్స్ కేసులో రోహ్‌తక్‌లోని సునారియా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.

Next Story