వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందించనున్న ప్రభుత్వం
ప్రత్యేక ఉన్నత విద్యార్హతలు కలిగిన వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 5:46 AM GMTప్రత్యేక ఉన్నత విద్యార్హతలు కలిగిన వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం జరిగిన ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అలా చేసిన మొదటి రాష్ట్రం ఢిల్లీ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రకటించారు. 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి వైద్య ధ్రువీకరణ పత్రం ఉన్నవారు అర్హులని తెలిపారు. అర్హులైన వారి నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం 1.20 లక్షల మంది వికలాంగులకు నెలవారీ పింఛను ఇస్తోంది. ప్రభుత్వం నుంచి వారికి నెలకు రూ.2500 వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉన్నత అర్హతలు కలిగిన వికలాంగులకు అదనపు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 10 వేల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఢిల్లీలో 2.44 లక్షల మందికి పైగా వికలాంగుల కేటగిరీ కిందకు వస్తారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం 42 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న 1,20,000 మంది వికలాంగులకు పెన్షన్ ఇస్తుంది.
ఇదిలావుంటే.. గత ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తులను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయేంద్ర గుప్తా లేఖ రాశారు. ప్రభుత్వం కొత్త దరఖాస్తులను స్వీకరిస్తే కనీసం 80 వేల మందికి పింఛన్లు అందుతాయని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ వృద్ధాప్య పింఛను పథకం గరిష్ట పరిమితి 5.30 లక్షల మంది లబ్ధిదారులని ఆయన అన్నారు. గత ఏడేళ్లుగా లబ్ధిదారుల సంఖ్య పెరగలేదు. ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. లబ్ధిదారుల సంఖ్య నిర్దేశిత సామర్థ్య పరిమితిని చేరుకున్నందున కొత్త దరఖాస్తులను స్వీకరించడం లేదని ఆ శాఖ వారికి లేఖ పంపింది. నిర్ణీత పరిమితిని పెంచడం అనేది క్యాబినెట్‌చే నిర్ణయించబడే విధానపరమైన అంశం. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద దాదాపు ఐదు లక్షల కొత్త దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పింఛను పొందిన దాదాపు 80 వేల మంది సీనియర్ సిటిజన్లు మరణించారు లేదా ఢిల్లీ నుంచి వెళ్లిపోయారు. వీరి స్థానంలో మరో 80 వేల మంది వృద్ధులు పింఛను పొందవచ్చు. 24 గంటల్లోగా ప్రభుత్వం తమ డిమాండ్‌ను అంగీకరించకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు పెద్దలతో కలిసి ఆందోళనకు దిగుతామని చెప్పారు.