దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ ప్రత్యేక దర్యాప్తు చేస్తోంది. తాజాగా రోహిణి జిల్లా కోర్టులో పేలుడు సంభవించిన కొద్ది రోజుల తర్వాత, ఢిల్లీ పోలీసులు శనివారం అక్కడ కోర్టు విచారణకు హాజరు కావాల్సిన న్యాయవాదిని చంపడానికి టిఫిన్ బాంబును అమర్చినందుకు ఒక శాస్త్రవేత్తను అరెస్టు చేశారు. డిసెంబర్ 9న రోహిణి జిల్లా కోర్టులో తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితుడు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, న్యాయవాది నిందితుడిపై 10 కేసులు నమోదు చేశాడని తెలిసింది. ఈ నేపథ్యంలో న్యాయవివాదాలు కలవరానికి గురిచేయడంతో న్యాయవాదిని హత్య చేసేందుకు శాస్త్రవేత్త ప్లాన్ చేశాడు. నిందితుడు బాంబును తయారు చేసి కోర్టు రూమ్ నంబర్ 102లో ఉంచాడని పోలీసులు తెలిపారు. విచారణలో లాయర్‌ను చంపాలనుకున్నానని, అందుకే తాను ఐఈడీని అమర్చానని సైంటిస్ట్ పోలీసుల ముందు అంగీకరించాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ శాస్త్రవేత్తకు వ్యతిరేకంగా సీసీ టీవీ ఫుటేజ్, డంప్ డేటాతో సహా పలు ఆధారాలు, సాక్ష్యాలను కనుగొంది. దాని ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు పోలీసుల విచారణలో సైంటిస్టు పేరు మాత్రమే బయటపడింది. తదుపరి విచారణ జరుగుతోంది.