దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. ఈ మహమ్మారి ధాటికి నిత్యం లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. వేలసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఉద్దృతి చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈ మహమ్మారి కట్టడికి ఆయా ఆయా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని విధిస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించింది. తెలుగు రాష్ట్రాల వారు ఏ మార్గంలో ఢిల్లీకి వచ్చినా.. 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ఆదేశించింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగటివ్ ఉంటే 7 రోజుల హోం క్వారన్ టైన్ లో ఉండాలని తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ నూతన వేరియంట్‌లను గుర్తించిన నేపథ్యంలో ఈ ఆంక్షలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇక ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.