ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. మంద‌కోడిగా ఓటింగ్

Delhi MCD Elections Live Updates. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల పోలింగ్ జరుగుతున్నందున స్వచ్ఛ ఢిల్లీ కోసం ఓటు వేయాలని

By Medi Samrat  Published on  4 Dec 2022 10:25 AM GMT
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. మంద‌కోడిగా ఓటింగ్

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల పోలింగ్ జరుగుతున్నందున స్వచ్ఛ ఢిల్లీ కోసం ఓటు వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. దాదాపు 1.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబరు 7న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. అదే రోజు ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. 1,349 మంది అభ్యర్థులు ఎన్నికల బ‌రిలో ఉన్నారు. 2017 మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపి.. ఆప్, కాంగ్రెస్‌లను ఓడించింది. ఎన్నికలు జరిగిన 270 వార్డులలో 181 స్థానాలను గెలుచుకుంది. వార్డుల విభజన తర్వాత దేశ రాజధానిలో జరుగుతున్న తొలి మున్సిపల్ ఎన్నికలు కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆప్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని 250 వార్డులకు ఆదివారం ఉదయం 8 గంటలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 5.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉద‌యం నుండి పోలింగ్ మంద‌కోడిగా సాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 30 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, సుమారు 13,665 పోలింగ్ స్టేషన్లలో దాదాపు 1 లక్ష మంది సిబ్బంది విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఎన్నిక‌ల‌లో సాదార‌ణ పౌరుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ, మాజీ క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ దంపతులు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలలో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికలు ఢిల్లీకి మేల్కొలుపు అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. రాబోయే 4-5 ఏళ్లలో మనం నం. 3 (ఆర్థిక వ్యవస్థ) అవుతామని ఇటీవల ఒక నివేదిక అంచనా వేసింది. కాబట్టి ప్రజలు ఏ బ్రాండ్ రాజకీయాలను ఎంచుకోవాలో ఎంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరీ ఓట‌ర్ల‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.


Next Story