న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష

నేరారోపణ కేసులో ఢిల్లీ హైకోర్టు ఓ న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిపై, పోలీసు అధికారులపై పదే పదే నిరాధారమైన ఫిర్యాదులు చేసిన న్యాయవాది దోషిగా తేలడంతో హైకోర్టు తీర్పు వెలువరించింది.

By Kalasani Durgapraveen  Published on  7 Nov 2024 4:00 PM IST
న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష

నేరారోపణ కేసులో ఢిల్లీ హైకోర్టు ఓ న్యాయవాదికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిపై, పోలీసు అధికారులపై పదే పదే నిరాధారమైన ఫిర్యాదులు చేసిన న్యాయవాది దోషిగా తేలడంతో హైకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ నవంబర్ 6, 2024న ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది తన చర్యలకు పశ్చాత్తాపం లేదా క్షమాపణలు చెప్పలేదని ధర్మాసనం పేర్కొంది. అతని ప్రవర్తన న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే విధంగా మసకబారించే విధంగా ఉంద‌ని పేర్కొంది.

కోర్టులోని జ్యుడీషియల్ అధికారులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులపై న్యాయ‌వాది 30 నుండి 40 ఫిర్యాదులను దాఖలు చేయడం కోర్టుకు చెడ్డపేరు తెచ్చి, దాని గౌరవాన్ని, అధికారాన్ని అణగదొక్కాలనే ఉద్దేశాన్ని స్పష్టంగా చూపుతుందని హైకోర్టు పేర్కొంది. న్యాయ‌వాది తన ప్రవర్తనకు పశ్చాత్తాపం లేదా క్షమాపణలు చెప్పడంలో విఫలమయ్యాడని పేర్కొంది.

న్యాయ‌వాది చేసిన అన్ని ఆరోపణలను వివిధ మేజిస్ట్రేట్‌లు, సెషన్స్, జిల్లా న్యాయమూర్తులు అలాగే ఈ కోర్టులోని న్యాయమూర్తులు తగిన విధంగా పరిష్కరించారని హైకోర్టు గమనించింది. ఇలాంటి విషయాలను పనికిమాలిన, నిరాధారమైన ఫిర్యాదులకు గురి చేయరాదని కోర్టు పేర్కొంది. కోర్టు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు తన వ్రాతపూర్వక సమాధానంలో సింగిల్ జడ్జిపై న్యాయ‌వాది పలు ఆరోపణలు చేసిన తీరు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని వెల్ల‌డించింది.

ఈ దశలో ఈరోజు జారీ చేసిన ఉత్తర్వుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తనకు సమయం ఇవ్వాలని, శిక్షను కొంత కాలం పాటు నిలిపివేయాలని న్యాయ‌వాది అభ్యర్థించాడని కోర్టు పేర్కొంది. అతను వ్యక్తిగతంగా కేసును వాదించడానికి ఎంచుకున్నాడని హైకోర్టు పేర్కొంది. ఆ వ్యక్తి న్యాయవాది సహాయం కోరితే ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ (DHCLSC) అతనికి న్యాయ సహాయం అందించాలని కోర్టు ఆదేశించింది.


Next Story