ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో 21 మందిని విముక్తి చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించేందుకు ఢిల్లీ హైకోర్టు నిందితులకు సమయం ఇచ్చింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేశారు. అయితే, ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయని, అటువంటి తీర్పు రికార్డుల్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. నిందితులు సమాధానం ఇవ్వడానికి వారం కంటే ఎక్కువ సమయం ఇవ్వకూడదని ఆయన కోరారు.
మరోవైపు, తాము ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆప్ నేతల తరపు న్యాయవాదులు తెలపగా, పైకోర్టు నుంచి స్టే వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. సమాధానం దాఖలు చేయడానికి తమకు తగిన సమయం కావాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. అంతకుముందు ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు తీర్పునిస్తూ.. సీబీఐ మోపిన అభియోగాలు కేవలం ఊహాగానాలే తప్ప, వాటికి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కేజ్రీవాల్, సిసోడియా సహా అందరినీ విడుదల చేసింది. సాక్ష్యాలు లేనప్పుడు నిందితులను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం న్యాయం కాదని ట్రయల్ కోర్టు అప్పట్లో అభిప్రాయపడింది.