పిటిషన్ కొట్టివేత.. జుహీ చావ్లాకు రూ.20లక్షల జరిమానా
Delhi HC imposes Rs 20 lakh fine on Juhi Chawla.బాలీవుడ్ నటి, పర్యావరణ వేత్త జుహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టులో గట్టి
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2021 6:45 PM ISTబాలీవుడ్ నటి, పర్యావరణ వేత్త జుహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. దేశంలో 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు సంబంధించి ట్రయల్స్‌ను వ్యతిరేకిస్తూ.. ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నేడు ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహాం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ చావ్లా సహా మరికొందరికి రూ.20లక్షల జరిమానా విధించింది.
జూవీ చావ్లా.. తన పిటిషన్‌లో 5జీ తరంగాల నుంచి వెలువడే రేడియేషన్.. మానవులపై, ఇతర జీవులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనిపై పరిశోధన చేయించాలని కోరారు. 5జీ టెక్నాలజీ మానవులకు, జంతువులు మరియు పక్షులతో సహా ఇతర జీవులకు ప్రస్తుతానికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా సురక్షితం అని సంబంధిత విభాగం నుండి ధృవీకరణ పత్రాన్ని కోరారు. దీనిపై న్యాయస్థానం ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపగా.. జుహీ అభిమానులు కొందరు ఆన్‌లైన్‌లోకి వచ్చి పలుమార్లు ఆటంకం కలిగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
దీనిపై నేడు మరోసారి విచారణచేపట్టిన హైకోర్టు.. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన పిటిషన్ మాత్రమేనని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టిపారేసింది. కోర్టు విచారణ లింక్‌ను జుహీ సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా అనిపిస్తోందని తెలిపింది. న్యాయ ప్రక్రియను హేళన చేసినందుకు గాను పిటిషనర్లకు రూ.20లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. 5జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా నటి జుహీ, వీరేశ్ మాలిక్, టీనా వచానీ పిటిషన్ దాఖలు చేశారు.