గుడ్ న్యూస్.. కార్మికుల కనీస వేతనం పెంచిన ప్రభుత్వం

దీపావళికి ముందే లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది

By Medi Samrat  Published on  25 Sep 2024 2:55 PM GMT
గుడ్ న్యూస్.. కార్మికుల కనీస వేతనం పెంచిన ప్రభుత్వం

దీపావళికి ముందే లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనం రూ. 18066 కు పెంచ‌గా.. ఇది గతంలో రూ. 17,494 ఉండేది. సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం ఇప్పుడు రూ.19,929 కాగా, గతంలో రూ.19,279గా ఉంది. అదేవిధంగా నైపుణ్యం కలిగిన కార్మికుల కనీస వేతనం గతంలో రూ.21,215గా ఉండగా.. ఇప్పుడు రూ.21,917కు పెరిగింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా కనీస వేతనాలను చూస్తే.. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో దేశంలోనే అత్యధిక కనీస వేతనాలు అందజేశామన్నారు. పేద ప్రజల శ్ర‌మ దోపిడీని నిరోధించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కనీస వేతనాన్ని చారిత్రాత్మక స్థాయికి పెంచిందని.. బిజెపి ఎప్పుడూ పేదలకు వ్యతిరేకమైన పని చేస్తుందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2016-2017లో కార్మికుల‌ కనీస వేతనాల పెంపుదల గురించి మాట్లాడితే.. బీజేపీ తమ‌ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా మమ్మల్ని అడ్డుకుంద‌ని.. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కనీస వేతనం పెంచాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చింది. దీన్ని కూడా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని.. అయితే.. ఎప్పటిలాగానే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా పోరాడి ఢిల్లీ సామాన్య ప్రజలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను పరిశీలిస్తే అక్కడ కనీస వేతనాలు ఢిల్లీలో ఉన్న దానిలో సగం ఉంటుంద‌న్నారు. బీజేపీ ఆ రాష్ట్రాలలో తక్కువ వేతనాలు ఇవ్వడమే కాకుండా ఢిల్లీలో కూడా క‌నీస వేత‌న పెంపును అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు.

Next Story