కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజ‌ర్వ్ చేసిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతికి సంబంధించిన సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది

By Medi Samrat  Published on  17 July 2024 11:18 AM GMT
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజ‌ర్వ్ చేసిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతికి సంబంధించిన సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు జూలై 29న రానుంది. ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డీపీ సింగ్‌ తమ వాదనలు వినిపించారు.

కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఆయన ముఖ్యమంత్రి.. ఉగ్రవాది కాదని అన్నారు. గత కొన్ని నెలలుగా జైలులో ఉన్న ఆయనను సీబీఐ అరెస్టు చేయలేదు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన వెంటనే సీబీఐ ఆయ‌నను అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసిందని.. ఆ త‌ర్వాత‌ కేజ్రీవాల్ లొంగిపోయారని తెలిపారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయం ఖచ్చితంగా సరైనది. కేజ్రీవాల్ ఎక్కడికీ పారిపోలేదని.. తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యారన్నారు. విచారణకు కేజ్రీవాల్ ఎప్పుడూ సహకరిస్తున్నారు. నిద్రిస్తున్న సమయంలో కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ ఐదుసార్లు 50కి దిగువకు చేరిందని.. ఇది ఆందోళనకు కారణం. నిద్రపోతున్నప్పుడు షుగర్ లెవల్స్ పడిపోవడం ప్రమాదకరం. ఈ కేసులో అందరికీ బెయిల్ వస్తున్నదని.. త‌న‌ పార్టీ పేరు ఆమ్ ఆద్మీ.. త‌న‌కు బెయిల్ రావడం లేదని అన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాద‌న‌లు విన్న కోర్టు తీర్పును రిజ‌ర్వ్ చేసింది.

Next Story