ఉమర్ ఖలీద్‌కు మధ్యంతర బెయిల్..

2020 ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు గురువారం ఢిల్లీ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించింది.

By -  Medi Samrat
Published on : 11 Dec 2025 6:30 PM IST

ఉమర్ ఖలీద్‌కు మధ్యంతర బెయిల్..

2020 ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు గురువారం ఢిల్లీ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించింది. ఉమర్ తన సోదరి వివాహం కోసం ఈ ఉపశమనం పొందాడు. ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు ఉమర్‌కు డిసెంబరు 16-29 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో ఉమర్ ఖలీద్‌ తన సోదరి వివాహానికి హాజరుకానున్నాడు.

JNU పూర్వ విద్యార్థి, ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్ 2020 నుండి ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారనే ఆరోపణలపై జైలులో ఉన్నాడు. ఉమర్ ఖలీద్‌పై యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. కర్కర్డూమా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సమీర్ వాజ్‌పేయి డిసెంబర్ 16 నుండి 29 వరకు ఖలీద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. దీని కోసం అతడు రూ. 20,000 వ్యక్తిగత బాండ్, అదే మొత్తానికి రెండు పూచీకత్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రత్యక్ష సాక్షిని లేదా మరే ఇతర వ్యక్తిని సంప్రదించవద్దని ఖలీద్‌కు న్యాయ‌స్థానం సూచించింది. మొబైల్ నంబర్‌ను దర్యాప్తు అధికారికి ఇవ్వాలని.. మొత్తం మధ్యంతర బెయిల్ వ్యవధిలో అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించింది. ఈ సమయంలో ఖలీద్ సోషల్ మీడియాను ఉపయోగించకూడదు. ఈ సమయంలో ఉమర్ తన కుటుంబం, బంధువులు , స్నేహితులను మాత్రమే కలుసుకోవడానికి అనుమతి ల‌భించింది. ఉమర్ ఇంట్లో లేదా వివాహ వేడుకలు జరిగే ప్రదేశాల్లో ఉండేందుకు కోర్టు అనుమతించింది.

అంత‌కుముందు అక్టోబర్ 2022లో ఢిల్లీ హైకోర్టు ఉమర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత ఉమర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా తర్వాత తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు. దీని తరువాత ట్రయల్ కోర్టులో రెండవ సాధారణ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మళ్లీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 'ముస్లిం సమాజ సభ్యులను పెద్ద ఎత్తున సమీకరించేందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు' చేసినందున మొత్తం కుట్రలో ఉమర్ ఖలీద్ పాత్ర 'తీవ్రమైనది' అని సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు బెంచ్ పేర్కొంది.

Next Story