అన్నాడీఎంకే 'రెండాకుల' గుర్తు కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం విచారణ చేపట్టిన స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే, రూ. 5 లక్షల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తం పూచీకత్తుపై ఆయనకు ఊరటనిచ్చారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ అత్యున్నతమైనదని, కేవలం ఆర్థిక నేరాలు లేదా ఇతర కేసులు ఉన్నాయనే కారణంతో విచారణలో జాప్యం జరుగుతున్నప్పుడు నిందితుడిని నిరవధికంగా జైల్లో ఉంచలేమని కోర్టు స్పష్టం చేసింది.
సుఖేష్‌పై మొత్తం 31 కేసులు ఉండగా, ఇప్పటికే 26 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించిందని.. ప్రస్తుత కేసులో విధించదగ్గ గరిష్ట శిక్షాకాలంలో సగానికి పైగా ఇప్పటికే జైల్లో గడిపారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే, ఇతర పెండింగ్ కేసులు ఉండటంతో సుఖేష్ ప్రస్తుతానికి జైలులోనే కొనసాగాల్సి ఉంటుంది. విచారణ సకాలంలో జరగనప్పుడు నిందితుడి హక్కులను కాలరాయలేమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.