Delhi Blast : ఆత్మాహుతి దాడికి ముందు సొంత గ్రామానికి వెళ్లి.. త‌మ్ముడికి ఒక ఫోన్ ఇచ్చి..

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో పాల్గొన్న ఆత్మాహుతి ఉగ్రవాది డాక్టర్ ఒమర్ నబీ దాడికి కొద్ది రోజుల ముందు తన కుటుంబాన్ని కలవడానికి పుల్వామాలోని తన గ్రామానికి వెళ్లాడు.

By -  Medi Samrat
Published on : 19 Nov 2025 8:27 AM IST

Delhi Blast : ఆత్మాహుతి దాడికి ముందు సొంత గ్రామానికి వెళ్లి.. త‌మ్ముడికి ఒక ఫోన్ ఇచ్చి..

ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో పాల్గొన్న ఆత్మాహుతి ఉగ్రవాది డాక్టర్ ఒమర్ నబీ దాడికి కొద్ది రోజుల ముందు తన కుటుంబాన్ని కలవడానికి పుల్వామాలోని తన గ్రామానికి వెళ్లాడు. ఉగ్రవాది ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అక్కడి నుంచే ఉగ్రవాద నెట్‌వర్క్ మొత్తాన్ని నడుపుతున్నాడు.

పుల్వామా నుండి తిరిగి వచ్చే ముందు.. అతడు తన ఫోన్‌లలో ఒకదాన్ని తన సోదరుడికి ఇచ్చాడు. ఉమర్ సహచరులను అరెస్టు చేసినట్లు సమాచారం అందడంతో.. సోదరుడు భయపడి.. గ్రామంలోని చెరువులో ఫోన్ విసిరేశాడు. ఆ తర్వాత నవంబర్ 10న ఉమర్ ఎర్రకోట సమీపంలో పేలుడు జరిపాడు. అందులో ఇప్పటివరకు 15 మంది మరణించారు.

మూలాల ప్రకారం.. దర్యాప్తు సంస్థలు ఉమర్ ఫోన్‌ల‌లో ఒక దాని నుండి ఆత్మాహుతి దాడికి సంబంధించిన వీడియోను కనుగొన్నాయి. ఈ వీడియో మంగళవారం మీడియాలో ప్రసారం చేయబడింది. ఈ వీడియోలో ఉమర్ ఆత్మాహుతి బాంబర్‌గా మారడానికి ప్రేరేపించడం కనిపిస్తుంది.

ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన తర్వాత ఉగ్రవాది ఉమర్‌ ఫోన్‌లు రెండూ స్విచ్‌ ఆఫ్‌లో ఉన్నాయి. భద్రతా సంస్థలు దర్యాప్తు చేసినప్పుడు.. అతని ఫోన్ చివరి లొకేషన్ న్యూఢిల్లీ, పుల్వామాలో ఉన్నట్లు కనుగొన్నారు.

తరువాత భద్రతా సంస్థలు ఉమర్ సోదరుడిని విచారించ‌గా.. ఉమర్ సహచరులు డాక్టర్ అదీల్, డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షాహీన్‌లను పట్టుకున్న తర్వాత తను భయాందోళనకు గురయ్యి ఫోన్‌ను చెరువులో విసిరిన‌ట్లు వెల్ల‌డించాడు. ఆపై భద్రతా సంస్థలు ఫోన్‌ను ట్రేస్ చేశాయి. నీటిలో పడిన తర్వాత ఫోన్ పాడైంది.. అయితే దర్యాప్తు సంస్థలు ఆ డేటాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు కొంత డేటాను స్వాధీనం చేసుకున్నట్లు.. ఉమర్ మ‌రో ఫోన్ నుండి ఆత్మాహుతి దాడిని ప్రేరేపించిన వీడియోను స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక‌లు వెల్ల‌డించాయి.

మూలాల ప్రకారం.. అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని భవనం నంబర్ 17లోని గది నంబర్ 13లో ఒమర్ ఈ వీడియోను చిత్రీకరించాడు. జైషేతో సంబంధమున్న ఉగ్రవాద వైద్యులు కుట్ర పన్నడానికి వాడిన‌ గది ఇదే. వీడియో దాడికి కనీసం ఒక వారం ముందు నాటిదని పోలీసులు గుర్తించారు.

Next Story