ఢిల్లీ పేలుడు.. ఘటనా స్థలానికి అమిత్‌షా
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 10 మంది మరణించారు.
By - Medi Samrat |
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 10 మంది మరణించారు. పేలుడు ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం వెల్లడి కాలేదు. అయితే.. ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఐ20 కారులో పేలుడు సంభవించిందని చెబుతున్నారు. పేలుడు తర్వాత ప్రభుత్వం కూడా యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది.
ఘటనాస్థలికి త్వరలో చేరుకుని పూర్తి సమాచారం సేకరిస్తామని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అదే సమయంలో ప్రధాని మోదీ కూడా అమిత్ షాకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ఎన్‌ఐఏ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. దీనికి ముందు అమిత్ షా ఐబీ చీఫ్‌తో కూడా మాట్లాడారు.
సాయంత్రం కారు పేలుడు గురించి అగ్నిమాపక శాఖకు కాల్ వచ్చింది. దీని తరువాత శాఖ వెంటనే ఆరు అంబులెన్స్‌లు, ఏడు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి పంపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దర్యాప్తు సంస్థలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి.
ప్రత్యక్ష సాక్షి, బాధితుడు పహర్‌గంజ్ నివాసి బల్బీర్ సింగ్ మాట్లాడుతూ.. తను వ్యాగన్-ఆర్ కారులో కూర్చున్నానని. తన సోదరుడు సరుకులు కొనడానికి చాందినీ చౌక్‌కు వెళ్ళినందున పేలుడు నుండి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపాడు. పేలుడు ధాటికి ఓ వ్యక్తి కారుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడని వెల్లడించాడు.