Indore Temple Tragedy : మెట్ల బావి ఘ‌ట‌న‌.. 35కి చేరిన మృతుల సంఖ్య‌

ఆల‌య మెట్ల బావి పై క‌ప్పు కూలిన ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 35 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2023 10:42 AM IST
Indore Temple Tragedy, Indore

మెట్ల బావి ఘ‌ట‌నలో 35కి చేరిన మృతుల సంఖ్య‌

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజ‌ధాని ఇండోర్‌లో జ‌రిగిన శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు పెను విషాదాన్ని మిగిల్చింది. ఆల‌య మెట్ల బావి పై క‌ప్పు కూలిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 35 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. గ‌ల్లంతైన మ‌రో వ్య‌క్తి కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు.

ఇండోర్‌లోని పటేల్‌నగర్‌లోని బలేశ్వర్‌ మహదేవ్‌ జులేలాల్ ఆల‌యంలో గురువారం నిర్వ‌హించిన శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వాల‌కు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. ర‌ద్దీ అధికంగా ఉండ‌డంతో వేడుక‌ను తిల‌కించేందుకు కొంద‌రు ఆల‌య ప్రాంగ‌ణంలో ఉన్న మెట్ల బావి క‌ప్పుపై కూర్చున్నారు. అధిక బ‌రువు కార‌ణంగా పురాతనమైన ఆ బావి పై క‌ప్పుకూలిపోయింది. దీంతో భ‌క్తులు బావిలో ప‌డిపోయారు.

సుమారు 50 మందికి పైగా భ‌క్తులు బావిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. 16 మందిని ర‌క్షించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 35 మంది మృత‌దేహాల‌ను వెలికితీశారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించామ‌ని, దోషులుగా తేలిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహ‌న్ ప‌రామ‌ర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.

Next Story