యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని మాజీ మంత్రి, మధుబన్ నియోజకవర్గ శాసనసభ్యుడు దారా సింగ్ చౌహాన్ ఆదివారం లక్నోలో అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ తర్వాత దారా సింగ్ చౌహాన్ బీజేపీని వీడి ఎస్పీలో చేరిన మూడవ మంత్రి. బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్-ఎస్‌కి చెందిన మరో ఎమ్మెల్యే ఆర్కే వర్మ కూడా ఈరోజు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. గత కొద్ది రోజులుగా నేతలంతా బీజేపీకి రాజీనామా చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే నెల నుంచి ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అఖిలేష్ యాదవ్‌ను ఉత్తరప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిని చేస్తానని దారా సింగ్ చౌహాన్ శపథం చేశారు. 2017లో బీజేపీ వెనుకబడిన వర్గాలకు చెందిన వారి నుండి ఓట్లు పొంది.. ప్రతిఫలంగా వారికి ఏమీ ఇవ్వలేదని అన్నారు. అందుకే వెనుకబడిన వర్గాలకు చెందిన వారందరూ ఎస్పీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. 'బీజేపీని ఓడించేందుకు, గద్దె దింపేందుకు మీరూ చేస్తున్న పోరాటానికి నా అభినందనలు. బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యేలా పోరాడుదాం' అని అఖిలేష్ యాదవ్ అన్నారు.