అనాదిగా వస్తున్న ఆచారానికి ముగింపు పలికే విధంగా, పట్టికజాతి క్షేమ సమితి (PKS) నేతృత్వంలోని దళిత బృందం కేరళలోని ఎన్మకజేలోని స్వర్గలో ఉన్న ఆలయంలోకి ప్రవేశించింది. దళితులు గ్రామంలో నివసించే 'అగ్ర కులాల' ప్రజలకు మాత్రమే కేటాయించబడిన నిషేధిత మెట్లను కూడా ఎక్కారు. దళితులతో పాటు పీకేఎస్ సభ్యులు తమకు ఆంక్షలు విధించిన 18 పవిత్ర మెట్లను ఎక్కారు. గతంలో కృష్ణ మోహన్ అనే దళితుడు ఇలాంటి పని చేశాడు. ధైర్యంగా, మోహన్ ఆలయంలోకి ప్రవేశించి, నిషేధించబడిన 18 పవిత్ర మెట్లను అధిరోహించాడు. కృష్ణమోహన్ చేసిన పనిని ఆయన వర్గీయులు నమ్మలేకపోయారు.
పట్టికజాతి క్షేమ సమితి ఆలయంలోకి ప్రవేశించిన తరువాత, పవిత్ర మెట్లు ఎక్కి.. అనాదిగా వస్తున్న ఆచారానికి ముగింపు పలికినట్లు వార్తా సంస్థ PTI వార్త సంస్థ తెలిపింది. 1947లోనే ఆలయంలోకి దళితుల ప్రవేశంపై నిషేధాన్ని రద్దు చేసినా.. కొన్ని ఏళ్లుగా ఈ అనాగరిక పద్ధతి కొనసాగుతూ వచ్చింది. అంతకుముందు దళితులను ఆలయంలోకి అనుమతించలేదు. 1936 ఆలయంలోకి దళితుల అనుమతిపై నిషేధం మొదట రద్దు చేయబడింది, అయితే మలబార్ ప్రాంతంలోని కాసరగోడ్ ప్రాంతంలో 1947లో అమలులోకి వచ్చింది.
పీకేఎస్ జిల్లా కార్యదర్శి బీఎం ప్రదీప్ మాట్లాడుతూ.. పవిత్రమైన 18 మెట్ల గుండా ప్రవేశంపై నిషేధం విధించడమే కాకుండా.. పూజా కార్యక్రమాలను చూసేందుకు అనుమతించే వారు కాదని తెలిపారు. దేవుడికి దక్షిణను వేయనిచ్చేవారు కాదని చెప్పారు. 'ప్రసాదాన్ని' (దేవునికి నైవేద్యంగా పెట్టే ఆహారం)ని వారి కులాల ఆధారంగా విడివిడిగా పంచేవారని ప్రదీప్ తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. మన సమాజంలో కొంతమంది ఇప్పటికీ ఈ దుష్ట పద్ధతులను అనుసరిస్తున్నారని, ఈ అనాదిగా వస్తున్న ఈ పద్ధతులను ఆపడానికి ప్రభుత్వ ఉత్తర్వు సరిపోదని అన్నారు. ఈ వివక్షను అంతం చేయడానికి సామాజిక జోక్యం అవసరమని మంత్రి తెలిపారు.