ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ వివాహ వేడుకలో భోజనం ముట్టుకున్నందుకు 18 ఏళ్ల దళిత యువకుడిని దుర్భాషలాడి దారుణంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటన వజీర్‌గంజ్‌లో జరిగింది. ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. నౌబస్తా గ్రామానికి చెందిన రేణు మాట్లాడుతూ.. తన తమ్ముడు లల్లా (18) గ్రామంలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. సందీప్ పాండే అనే వ్యక్తి ఇంట్లో పెళ్లి విందు ఏర్పాట్లు చేశాడని చెప్పారు.
లల్లా భోజనం చేసేందుకు ప్లేట్ తీసుకున్న వెంటనే సందీప్, అతని సోదరులు లల్లాను దుర్భాషలాడారు. ఆ తర్వాత కొట్టారు. లల్లా అన్నయ్య సత్యపాల్‌ను రక్షించేందుకు ప్రయత్నించగా, వారు అతడిని కొట్టి మోటారు సైకిల్‌ను ధ్వంసం చేశారు. ''సందీప్, అతని సోదరుల ప్రవర్తన గురించి గ్రామంలోని పెద్దలకు చెప్పాము. విషయం తెలుసుకున్న నిందితులు మా ఇంట్లోకి చొరబడి, లల్లాను మళ్లీ కొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు'' అని రేణు ఆరోపించారు.
అకస్మాత్తుగా లేదా నిర్లక్ష్యంగా మానవ ప్రాణాలకు లేదా ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు నిందితులైన సందీప్ పాండే, అమ్రేష్ పాండే, శ్రవణ్ పాండే, సౌరభ్ పాండే, అజిత్ పాండే, విమల్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గోండా ఏఎస్పీ శివరాజ్ తెలిపారు. వారిపై ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద కూడా అభియోగాలు మోపారు. కేసును విచారిస్తున్నామని, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.